Monday, March 17, 2014

నా కథలు 1: " బి'ఛీ'నెస్ "

పది అంతస్తుల మేడ - వాడి ఆఫీసు.
ఒక మహారాజప్యాలెస్ లాగా ఉంది - వాడి రూమ్.
నేను వింటున్నాను - వాడు మాట్లాడుతున్నాడు.

వాడు :   "అదిగో..అక్కడ కూర్చుని బుద్ధిగా పనిచేసుకుంటూ వున్నాడే"

అటువైపు చూసాను. అక్కడొక వ్యక్తి. అంతా బాగానే వున్నాడు కానీ, అతని ముఖంలో ఏదో కోల్పోయిన
ఫీలింగ్ కనపడుతుంది.

వాడు :  " అతని పేరు ఆనంద్ - Engineering + MBA - చాలా చురుకైనవాడు.
              అందుకే కాలేజ్ పట్టా చేతికి రాగానే, నా వ్యాపారానికి పోటీ వచ్చాడు.
              అతని దగ్గరవున్న పెట్టుబడి అంతా కలిపి, మొదటిసారి 1000 టన్నుల ప్రొడక్ట్ని
              మార్కెట్లో దింపాడు. ఆశ్చర్యం..అద్భుతం. నెల రోజుల్లోనే మొత్తం ప్రొడక్ట్ సేల్
              అయిపోయింది. అప్పట్లో మీ పేపర్ వాళ్ళంతా తనని ఆకాశానికి ఎత్తేసారు.
              ' యువ Entrepreneur హవా' అని.. అంతే ఉత్సాహంతో రెండోసారి, తనకి తెలిసిన
              వాళ్ళ దగ్గర అప్పుచేసిమరీ 2000 టన్నుల ప్రొడక్ట్ని మార్కెట్లోకి దించాడు. అద్భుతం
              20 రోజులకే జరిగింది. ప్రోడక్ట్ అంతా మార్కెట్లో క్లియర్ సేల్. నాకు బాగా గుర్తు,
              అప్పట్లో ఆనంద్ అమెరికాలో జరిగిన ఒక conferenceలో తన విజయయాత్ర గురించి
              బాగా మాట్లాడాడని మీ పేపర్లో ఇంకాబాగా వ్రాశారు...హు...ముచ్చటగా మూడోసారి,
              ఈసారి తనకి తెలియని వాళ్ళదగ్గర నుండి కూడా అప్పుతీసుకుని, ఏకంగా 10,000
              టన్నుల ప్రొడక్ట్ని దించేసాడు. ఆరు నెలలైనా అద్భుతం మాత్రం జరగలేదు. 10,000
              టన్నుల ప్రొడక్ట్, 10 టన్నులైనా అమ్ముడవ్వలేదు. తీసుకున్న అప్పుకి వడ్డీ మాత్రం
              కొండంత అయ్యింది. మరో ఆరు నెలలకి ఆనంద్ ని పిలిచి నా కంపెనీలో Manager Post
              ఇచ్చాను. కళ్ళకద్దుకుని జాయిన్ అయ్యాడు. అతని 10,000 టన్నుల సరుకుని నేనే
              కొన్నాను. అతను నన్ను దేవుడనుకున్నాడు. "

జేబులో నుండి ఒక ఖరీదైన సిగరెట్ తీసి ముట్టించాడు. నా అంచనా ప్రకారం ఆ సిగరెట్ ఖరీదు
నా నెల జీతంతో సమానం. వాడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.

వాడు :  " ఇది అందరికీ తెలిసిన కథ. ఎవ్వరికీ తెలియని కథ, చివరికి ఆనంద్ కి కూడా.. అదేంటంటే,
              అతను మొదటిసారిగా మార్కెట్లో పెట్టిన 1000 టన్నుల్నీ..రెండోసారి పెట్టిన 2000 టన్నుల్నీ
              కూడా కొనింది నేనే "

నా చేతిలోవున్న పెన్ కిందపడిపోయింది. వాడు వదులుతున్న పొగలో ఆనంద్ ముఖం కనపడుతుంది.

No comments:

Post a Comment